రాజ్ చాలా గ్రేట్: భర్తపై సమంత ప్రశంసలు
- గత డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత
- నిర్మాతలుగా 'మా ఇంటి బంగారం' సినిమాను నిర్మిస్తున్న జంట
- రాజ్ అద్భుతమైన క్రియేటర్ అని ప్రశంసించిన సమంత
దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును ప్రముఖ సినీ నటి సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మరోవైపు, వీరి జీవిత ప్రయాణం సంతోషంగా, అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ సమంత-రాజ్ నిడిమోరుల బంధం మరింత బలపడుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల తర్వాత, ఇప్పుడు ఈ జంట ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం జట్టు కట్టారు.
సమంత సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ద్వారా రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెన్నెల కిషోర్ అడిగిన 'మీ ఫ్యామిలీ మ్యాన్' ఎలా ఉంటారు? అనే ప్రశ్నకు సమాధానంగా.. "రాజ్ చాలా గ్రేట్, ఆయనో అద్భుతమైన క్రియేటర్" అంటూ సమంత తన భర్తపై ప్రశంసలు కురిపించడం వారి మధ్య ఉన్న గౌరవాన్ని చాటిచెబుతోంది.
2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో అత్యంత నిరాడంబరంగా జరిగిన వీరి వివాహం అప్పట్లో పెద్ద సంచలనం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వస్తున్న వీరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక సాధారణ గృహిణి పవర్‌ఫుల్ మహిళగా ఎలా మారిందనే కాన్సెప్ట్‌తో 'ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్'గా వస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది.